Friday, May 1, 2009

మా చిన్నపుడు టి.వి.

మా చిన్నపుడు మా వీధిలో ఒక ఇంట్లోవారు టి.వి. కొన్నారు. అప్పటివరకూ రేడియోను విన్న జనాలకు టి.వి. చూడటం అదో అద్భుతం. ఇక మా వీధిలో ఆ టి.వి. ఉన్న ఇంటివాళ్ళు ఓ వెలుగు వెలిగారు. తెగ పోజులు కొట్టేవాళ్ళు. ఇక ఆదివారం వస్తే చాలు సాయంత్రం దూరదర్శన్ లో వచ్చే సినిమాకోసం దీపం చుట్టూ పురుగుల్లా మా వీధిలో జనాలంతా ఆ ఇంట్లో చేరిపోయేవారు. మా పిల్లలం మాత్రం సినిమా 4 గంటలకైతే 3 గంటలకే ఆ ఇంటిముందు కాపు కాసేవాళ్ళం ఎందుకంటే మళ్ళీ ఆ ఇంట్లో మాకు కూర్చోడానికి స్థలం దొరకదు కదా!!



ఆ ఇంటి పిల్ల దెయ్యాలతో మా వీధి పిల్లలం ఆడేటపుడు మాత్రం తెగ చిక్కు వచ్చేది. ఎందుకంటే ఆటలో వాళ్ళను గెలవనివ్వాలి లేదంటే మిమ్మల్ని టి.వి. చూడటానికి రానివ్వం అని బెదిరించేవాళ్ళు. మనసులో తిట్టుకున్నా బయటకు మాత్రం అందరం వాళ్ళతో తెచ్చిపెట్టుకున్న స్నేహం వెలగబోసేవాళ్ళం.



ఇక ఆదివారం ఉదయం హిందీ పాటలు రంగోలి, రామాయణం తర్వాత కార్టూన్స్ వాటిలో నాకు గుర్తు ఉన్నది జంగిల్ బుక్, స్పైడర్ మ్యాన్.... రామాయణం ప్రభావంతో కొబ్బరి చీపురు పుల్లలు తీసుకొని ఒక పుల్లను విల్లులాగా ఇంక మిగిలిన పుల్లలు బాణాలన్నమాట.. దాంట్లో వచ్చే సౌండ్ ఎపెక్ట్స్ అన్నీ మా నోటితో చేసేవాళ్ళం ఆ ఆ ఆ ఆ.... డిష్క్యాం డిష్క్యాం ... జుప్ జుప్ ఆ ఆ ఆ ఆ జప్ జప్ .... బూమ్ బూమ్...



ఇంక గురువారం వస్తే చిత్రలహరి... ఆ గురువారం చూసిన పాటలు మళ్ళీ గురువారం వరకూ పాడుకునేవాళ్ళం. ఆదివారం సినిమా చూసి మరుసటి రోజు స్కూలుకు వెళ్ళాక స్నేహితులతో ఆ సినిమాలోని జోక్స్, పాటలు అన్నీ ముచ్చటించుకునేవాళ్ళం. దూరదర్శన్ లో యాంకర్స్ మాకు దేవతల్లా కనిపించేవాళ్ళు. అప్పట్లో వారానికొకసారి వచ్చే (రోజుకొక సీరియల్ చొప్పున) సీరియల్స్ ను అపురూపంగా చూసేవాళ్ళం. నాకు గుర్తున్నంత వరకూ మహా అయితే 14 నుంచి 25 భాగాలు మాత్రమే ఉండేవి. కానీ ఇపుడు సీరియల్స్ 1000, 2000 మీ కళ్ళు పుళ్ళయ్యే వరకూ చూసుకోండి అన్నట్లు...



అప్పట్లో దూరదర్శన్ లో కిట్టిగాడు, హిమబిందు, ఆనందోబ్రహ్మా, ఇంక ఏవో మాయల మంత్రాల సీరియల్స్ వచ్చేవి పేర్లు గుర్తులేవు. ఒక మాయలు, మంత్రాలు ఉన్న సీరియల్ లో అయితే ఇద్దరు మనుష్యులు ఓ రకమైన పద్ధతిలో చేతులు కలపి కరచాలనం చేసుకొని ‘‘లాబాజిబాబా’’ అంటూ ఓ మంత్రం లాంటిది ఏదో చెప్పేవాళ్ళు. మా పిల్లలం స్కూల్లో, ఇంటి దగ్గరం ప్రెంఢ్స్ మి కలసి తెగ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మేము కలిసినపుడు అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చుకొనేవాళ్ళం. చెప్పాలంటే దాదాపు సినిమాలో సీరియల్ లో ఇలాంటివన్నీ అనుకరించేవాళ్ళం.



వారం వరకూ వెయిట్ చేసి చూసే సీరియల్స్ కానీ, పాటలు కానీ, సినిమా కానీయండి ఎంతో థ్రిల్లింగ్..గా అనిపించేది. కానీ ఇపుడు వంద ఛానల్స్... మన చేతిలో ఉన్న రిమోట్ మన కళ్లను ఏ ఛానల్ సరిగ్గా చూడనివ్వదు. రోజూ సినిమాలు.... చూసినవే చూసి విసుగు.. సీరియల్స్ సంగతి చెప్పక్కరలేదనుకోండి. టి.వి. కోసమైన అందరం కలిసేవాళ్ళం. ఇపుడు ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి టి.వి వాళ్ళది. ఆఖరికి చిన్న పూరిపాకల్లో కూడా పెద్ద పెద్ద కలర్ టి.వి.లు.



అప్పట్లో శివరాత్రికి ఏవైనా భక్తి సినిమాలు వేసేవాళ్ళు... ఇపుడు రకరకాల ఛానల్స్ వాళ్ళు వేసే కొత్త సినిమాల కోసం జనాలు జాగారాలు చేస్తున్నారు. ఇపుడు అంత దృశ్యం కూడా లేదు సినిమా రిలీజ్ కు ముందే డివిడిలు రిలీజ్ అవుతున్నాయి. ఇంత ఉన్నా అప్పటి ఆ కళ ఇపుడు కల మాత్రమే.



వచ్చిన వ్యాఖ్యలు :

27 comments:

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

లబజిబాబా అని మేము కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవాళ్ళం( సీరియల్ పేరు గుర్తు లేదు కాని పొట్టీ వీరయ్య ఉండేవాడు ఆ సీరియల్లో ). కాశీమజిలి కథలు అప్పుడు వచ్చేవనుకుంటాను. చిత్రలహరి శుక్రవారం కదా.... గురువారం అని వ్రాసారు..

|| తమ్మిన అమరవాణి || చెప్పారు...

మొదట గురువారమే ఉండేది... తర్వాత శుక్రవారానికి మార్చారండి

subhadra చెప్పారు...

baagudi,

jabulu-javabulu kuda chusevallam.

oleti parvatisam,sudharani,santiswaroop,

vijayarani,vartalu chadive latha.....patalu pade ramachari..... chinna serial lo devadas kanakala family

meru anna pilladeyyalu bhusa naku vartistudemo ma intlo t.v undedi.

1985 lo maa tatagaru konnaru.

kani yappudu aatalalo

yemi wrong game aadinatlu gurutu ledu.

ainaa adugutaa naa chinnapati friends..

|| తమ్మిన అమరవాణి || చెప్పారు...

సుభద్ర గారు

చాలా ప్రోగ్రామ్స్ గుర్తు చేసారు. నేను మర్చిపోయాను. యాంకర్స్ కూడా చాలా అందంగా ఉండేవాళ్ళు. శాంతిస్వరూప్ ఒకరే గుర్తున్నారు. మిగిలిన వాళ్ళ ముఖాలు గుర్తున్నాయి కానీ... పేర్లు గుర్తులేవు...

సిరిసిరిమువ్వ చెప్పారు...

1982 లో అనుకుంటా ఆసియా గేంసు జరుగుతున్నప్పుడు మా ఊరికే కాదు చుట్టుపక్కల నాలుగు వూళ్లకి మొదటిసారిగా మా ఇంట్లో టి.వి కొన్నారు.



ఆదివారాలు సినిమా టైంకి మా ఇల్లు పట్టేది కాదు..మేము సినిమా చూసేది వుండేది కాదు:). ఎందుకొచ్చిన టి.వి రా బాబూ అనిపించేది.



ఇందిరాగాంధి చనిపోయినప్పుడైతే ఏకంగా టి.వి బయట దొడ్డి మీద పెట్టాల్సి వచ్చింది-అంతమంది జనం.

చదువరి చెప్పారు...

ఆ మాయల సీరియల్లోనేననుకుంటా.. పేర్లు భలే వింతగా ఉండేవి - మిత్రాంద్ర అనేదొకటి నాకు గుర్తుంది. పుచ్చా ఇంటిపేరుగల నటుడు ఉండేవాడందులో. (పుచ్చా పూర్ణానందం కాదు, కుర్రవాడే!)

సీనుగాడు చెప్పారు...

లబజిబాబా అనే మాట.. "ఇది ఎక్క్డైన ఉందా??" అనే సీరియల్ లో వాడినారు



ఇట్లు

సీనుగాడు

నేస్తం చెప్పారు...

abbaa mee tapaa inkaa vaakyalu chaduvutunte malli aa rojulaloki vellipoyaa.. vijayalaxmi gaaru santhswaroop chellelu anevaaru.. enta varaku nijamo :)

krishna rao jallipalli చెప్పారు...

ఆస్తాన్ విద్వాంసుడు సుధీర్ కుమార్ని మర్చి పోయారు.

రాధిక చెప్పారు...

అరె మెము కూడా లాబాజీబాబా ని అనుకరించినవాళ్ళమే.అలాగే డామిట్ కధ అడ్డం తిరిగింది,కిట్టిగాడు,విచిత్ర కాశీ మజిలీ కధలు నాకు ఇష్టమైన సీరియల్స్.బధిరుల వార్తల ను ఎంతగా అనుకరించేవాళ్ళమో.ఆదివారం మధ్యాహ్నం వచ్చే వేరే భాషా చిత్రాలు కూడా బాగా చూసేవాళ్ళం.రామాయణం,భారతం అయితే మా చిన్నాన్నగారి ఇల్లు కిట కిటలాడిపోయేది.ఆదివారం టీవీ తెచ్చి వాకిట్లో పెట్టేవారు.ఆ దూరదర్శన్ పుణ్యమా అని నాచేత అన్ని హిందీ పరీక్షలు కట్టించేసారు మావాళ్ళు.

శ్రీ చెప్పారు...

మా ఊర్లో అయితే అందరూ చందాలు వేసుకుని "మా టీవీ" అని ఒక క్రౌన్ టీవీ కొని పెట్టారు.చిత్రలహరి కి ఊర్లో వాళ్ళు గుంపులు,గుంపులుగా వెళ్ళి చూసేవాళ్ళం.తమిళ్ పాటలు "ఒళియం ఒళియం" కూడా చూసేవాళ్ళం. ఉదయం పూట క్రికెట్ పెట్టేవాళ్ళు, అసలు ఏమీ కనిపించేది కాదు.

HAREPHALA చెప్పారు...

మీరు టీ వీ కొనుక్కున్న వాళ్ళ పాట్లు వ్రాయలేదు.నేను పూనా లో ఫాక్టరీ క్వార్టర్స్ లో ఉండగా డభై అయిదు లో టీవీ మొట్టమొదట కొన్న అభాగ్యులలో ఒకడిని.మేము పడ్డ పాట్లు పగవాడికి కూడా వద్దు.

|| తమ్మిన అమరవాణి || చెప్పారు...

సిరిసిరిమువ్వగారు

టి.వి ఉన్నవాళ్ళ కష్టాలు ఒకలాంటివైతే, టి.వి లేని కష్టాలు ఒకలాంటివి.



చదువరిగారు

పుచ్చారామకృష్ణ



సీనుగాడు గారు

అవును సీరియల్ లోనే వాడారు.



నేస్తం గారు

విజయలక్ష్మీ గారిని శాంతిస్వరూప్ చెల్లెలు అనేవారు. కానీ ఇప్పటికీ నా వరకు సస్పెన్సే.



కృష్ణారావు గారు

సుధీర్ కుమార్ ఎవరో గుర్తులేదు అసలు :-(



రాధిక గారు, శ్రీ గారు :-)



HAREPHALA గారు

మేము టి.వి. కొన్నాక పాపం టి.వి ఉన్నవాళ్ళ పాట్లు అర్ధమయ్యాయండి... టి.వి చూడటానికి రానియ్యకపోతే పాపం వాళ్ళని బాగా తిట్టుకొనేవాళ్లం కానీ.... తర్వాత వాళ్ళ బాధలు అర్ధమయ్యాయి. మనసులో సారీలు చెప్పుకున్నా...

చక్రవర్తి చెప్పారు...

చిత్రహార్ అని హిందీ పాటల కార్యక్రమం బుధవారం వచ్చేది అలాగే చిత్రలహరి అని తెలుగు పాటల కార్యక్రమం వచ్చేది. నాకు బాగా గుర్తు, ఇలా సినిమా చూస్తూ ముందు వరుసలో కూర్చొని నిద్రపోయ్యేవాడిని.



ఇలా వాళ్ళింట్లో వాళింట్లో నిద్రపోతున్నానని మా అమ్మ ఎలాగోలా కష్టపడి మా ఇంట్లోకి కూడ టీవి కొని తెచ్చింది. అదిగో ఇంకే, మా సందులో మేమూ గొప్పోళ్ళం అయ్యిపోయ్యాము.

|| తమ్మిన అమరవాణి || చెప్పారు...

చక్రవర్తిగారు

నేను చాలావరకూ మర్చిపోయాను. టపా రాయడం వల్ల బ్లాగర్లందరూ చాలా మంచి జ్ఞాపకాలు, ప్రోగ్రామ్స్ గుర్తు చేసారు. అప్పట్లో హింది రాకపోయినా హింది పాటలు, సినిమాలు కూడా చూసేవాళ్ళం.

రవిగారు చెప్పారు...

అప్పట్లో ఎవరైనా జాతీయ నాయకులు పొతే జనాలంతా కుళ్ళి కుళ్ళి ఏడ్చే వారు.వాళ్ళు పోయినందుకు కాదు . టీవీ లో వోఇలేన్ పట్టుకుని ఒక గంట వాయించాక , ఇంకో ముల్లా ఎవరో వచ్చి ఖురాన్ లో సూక్తులు మొత్తం ప్రొగ్రమ్మెస్ అన్ని కాన్సిల్ చిత్రలహరి, సినమా లతో సహా. ఇంక శాంతి స్వరూప్ అయితే వాళ్ళ ఇంట్లో సొంత భంధువులు పోయినట్టు గొంతులో భాధ ని పలికిన్చేవాళ్ళు. ఇంక రాత్రి కరెక్ట్ గా భోజనాలు చేసే టైం కి పాలు చేలు అన్న కార్యక్రమలో గేదె పేడని ఎరువులు గా ఎలా వాడుకోవచ్చో చూపేవారు..విజయ దుర్గ పెద్ద పెద్ద కొప్పులు పెట్టుకుని మరి వచ్చేవారు.ఇంక విజయలక్ష్మి గారు శాంతి స్వరూప్ భార్య.ఇవన్ని గుర్తు చేసినందుకు మీకు ఆయుష్మాన్ భవ.

|| వాణి || చెప్పారు...

ఓహ్ రవిగారు

చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసారు. అపుడు మేము పిల్లలం కదా!! నిజంగానే ప్రోగ్రామ్స్ ఏమీ రాక అల్లాడేవాళ్ళం... పైగా ఓ విషాదమైన మ్యూజిక్ పెట్టేవాళ్ళు...

boss చెప్పారు...

naku patha rojula teepi gnapakau ochaiandi.....thank u

నేను చెప్పారు...

"ఇంత ఉన్నా అప్పటి ఆ కళ ఇపుడు కల మాత్రమే"

అప్పట్లో ప్రేమికుడులో పాటలో అంటారు "చిత్రలహరిలొ కరంటు పోతే ...take it easy policy" అని దాని బట్టి మన చిత్రలహరి ఎంత గొప్పదో కదా ... :)

Manohar చెప్పారు...

kittigadu chala bagundedi. ruthuragalu vachchevaraku anni 13 bhagaale undevi, mamulu serials.

okka sri krishna tappithe

జయ్ చెప్పారు...

ఇందిరా గాంధీ పోయినప్పుడు నేను నర్సరీలో ఉన్నాననుకుంటాను.. ఇందిరా గాంధీ పోయిన దృశ్యాలను చూడడం కోసమే మా మామయ్య టి.వి. కొన్నారు. ౩ రోజుల విశాద సంగీతం ముగిసాక, మా సాడిష్టు చిన్న మామయ్య ప్రతీ శనీ ఆది వారాలలో వచ్చే దయ్యాల సినిమాలు తిట్టి మరీ చూపించేవారు. ఆయన పుణ్యమా ఇప్పుడు దేవుళ్ళకు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టేశాను.. మా అమ్మమ్మ సంగతి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.. ఏ భాష సినిమా వేసినా నవ్వుకుంటూ చూసేవారు, ఆఖరుకు సినిమాలో విలన్ ఏడ్చినా కూడా ఏడ్చేవారు... ఏంటో.. అప్పుడు మా అమ్మమ్మ ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక, నేను కూడా ఏడ్పందుకునే వాన్ని...



చిన్న పిల్లాన్ని కదా మరి అప్పుడు... :)

సుజాత చెప్పారు...

చదువరి గారు,

అతడి పేరు పుచ్చా రామకృష్ణ! ఆ మంత్రాల సీరియల్ కి ఇంత ఫాలోయింగ్ ఉండేదన్నమాట. ఇక్కడ అందరూ దాని ఫాన్సే ఉన్నారు.



కృష్ణా రావు గారు చెప్పినట్లు సుధీర్ కుమార్ గార్ని మర్చిపోయారు. ఆయన ఆ తర్వాత తులసి దళం అనే సీరియల్లో కూడా నటించాడు.



మా ఇంట్లో కూడా ఇదే తంతు! పైగా మా ఇంట్లో ఒక కొసరు పోర్టబుల్ టీవీ ఉండేది. దాన్ని బాటరీతో నడిపించే ఏర్పాటు. క్రికెట్ మాచ్ లప్పుడు కరెంట్ పోతే మా ఇంట్లో తిరణాలే! అందరూ మా ఇంట్లోనే! పైగా బాటరీ కూడా సొంత డబ్బుతో జోజి మైక్ సెట్టింగ్ వాళ్ల దగ్గర ఛార్జింగ్ పెట్టించడానికి కుర్రళ్లంతా రెడీ అయ్యేవాళ్ళు. ఇంట్లోకి వెళ్ళాలంటే సందులోంచి తిరిగి పెరటి దోవకుండా వెళ్ళాల్సి వచ్చేది.



ఆ హిమబిందు అమ్మాయి ఏమైపోయిందో, ఆ సీరియలే మొదలు, చివర! ఆ సీరియల్ తోనే గుండు హనుమంత రావు పరిచయం అయ్యాడు.



రాధిక చెప్పిన "డామిట్..." సీరియల్ కూడా స్టూడెంట్స్ కథతో బాగుండేది.



రాస్తుంటే ఇంకా వస్తూనే ఉంటాయి జ్ఞాపకాలు. ఇక చాలిస్తా!



దూరదర్శన్ పుణ్యమా అని హిందీ అంటే ఉన్న భయం పోయి మాట్లాడేంత ఫ్లూయెన్సీ వచ్చేసింది.



రవిగారు,శాంతి స్వరూప్ భార్య పేరు రోజా రాణి అండి, విజయలక్ష్మి కాదు.

చదువరి చెప్పారు...

ఔనౌను, పుచ్చా రామకృష్ణ! శ్శ్..శ్శ్..శ్శ్ అంటూ నవ్వేవాడు ఆ పాత్రలో! :)

krishna rao jallipalli చెప్పారు...

దూరదర్శన్ అప్పట్లో అందరకి నవ్వుల్ని పంచేది.. అన్ని రకాలుగా. శాంతిస్వరూప్: వార్తలు చదివే ఆస్థాన విద్వాంసుడు. మాటలని నిన్చోపెట్టి, పడుకోబెట్టి, వొంగోబెట్టి, విరగాకొట్టి చదివేవారు. కూర్చోవడంకూడా ... ఏ మాత్రం చలనం లేకుండా, ఒక విగ్రహంలా కూర్చొనే వారు. అదో స్టైలూ....

2. వోలేటి పార్వతీశం... వీరు కూడా ఆస్థాన విద్వాన్సుడే. జాబులు జవాబులు కార్యక్రమంలో పొగడ్తల ఉత్తరాలు 90 ఉంటే వాటన్నిటికి చక్కగా మరీ విడమర్చి జవాబులు చెప్పే వారు. విమర్శల ఉత్తరాలు కేవలం ఒకటో రెండో చదివే వారు. దానికి వారి జవాబులు ఎంతో సమయస్ఫూర్తితో అది ఒకటి రెండు పదాలతో జవాబులు ఇచ్చే వారు. దాటవెయడంలో ఘనాపాటి .

3. సుధీర్ కుమార్... ఆస్థాన సంగీత విద్వాంసుడు. తరువాత్తరువాత నాటికలు, సీరియల్స్ లో నటించే వారు. (కొత్తవారికి చోటిచ్చే ప్రసక్తి లేదు).

4. రోజా రాణి.. ఆస్థాన announcer. అందంగా ఉండి అందర్ని ఆకట్టుకొనే వారు.

WORLD RECORD: సిని నటి నిర్మలమ్మ నటించిన పోరాటం అనే నాటికని .. ఏ ప్రోగ్రాములు లేకపోతె.. కొన్ని వందల సార్లు ప్రసారం చేసారు. మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు.

INDIA RECORD: జేబుల్లేని చొక్కా అనే ఒక భయంకర హాస్య (అని మనము అనుకోవాలి) నాటికను ప్రసారం చేసి తెలుగు దూరదర్శన్ ఒక రికార్డుని నెలకొల్పింది. (దీనిని అంబిక అగర్బత్తి వారు స్పొంసార్ చేసారు. నేను వారికి ఒక ఉత్తరం రాసాను.. మేరు కనుక ముందు ముందు ఇటువంటి భయంకరమైన నాటికలను స్పొంసార్ చేస్తే... మీ అగర్బత్తిలను కొనను అని)

ఇంకా ఎన్నో ఎన్నో కామెడి జ్ఞాపకాలు... తలచుకొంటే భలే సరదాగా ఉంటాయి. కొన్ని కొన్ని ప్రోగ్రాములు చూస్తుంటే.. ప్రోగ్రాములు ఇలా ఉండకూడదు అనే ప్రామాణికాలు నెలకొల్పిన ఘనత దూరధర్శన్కే దక్కుతోంది. (OUT OF PLACE అని అనుకోపోతే... ఈ విషయం కొన్ని కొన్ని బ్లాగులకు కూడా వర్తిస్తుంది)

ఇక శెలవా మరి.

|| వాణి || చెప్పారు...

కృష్ణారావు గారు

మీరు చాలా మంది పేర్లను గుర్తు చేసారు. ఇక అంబికా వాళ్ళ సంగతికొస్తే పాపం అపుడు మహావృక్షం దూరదర్శనే కాబట్టి... స్పాంసర్ చేసుంటారు. ఇపుడు అలా చెయ్యరులెండి.. lol. పాపం అలా బెదిరిస్తే ఎలాగండీ...

ఇది వరకూ మేము టెలీస్కూల్ బాగా చూసేవాళ్ళం. మొన్నామధ్య ఎందుకో ఏదైనా మార్పులు వచ్చాయేమో అని చూస్తే... అప్పటి కార్యక్రమాలే ప్రసారం చేస్తున్నారు...

బ్లాగుల విషయంలో నాకు కూడా అపుడపుడు అలానే అనిపిస్తుంది... కానీ నాకు ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది... ఎవరిగోల వాళ్ళదే...

Muvva చెప్పారు...

appatlo Achyuth, Shilpa dooradarshan hero and heroines ga vunde vallu. baga alarinchindi.. paramanandayya gari shishula katha. alage Guinnies book of world records kuda serial ga vachedi. sat'day roju... news break lo dinner complete chesi..migatha 10 mins cinema chuse vallamu.



*chala sarlu.. "Antha rayaniki chintustunnamu " ani vachedi.

samarsimham చెప్పారు...

andhariki namaskaramandi, telugu typing ikkada leka english lo telugu type chesthunnam,idhi mana kahrma,oka vishayam andharu amrchi poyaru,thenaramalingadu(ashokkumar,ashok rao),anandhobraham(dharmavarapu) seriels chala bagundevi,alage paina cheppina serials mariyu programs chala bagundevi.aadivaram 9:00 ki lesthe rathri 9:00 varaku asalu doordarshan mundhara nundi leche vallam kaadu.aa paatha gnapakaalu ippatiki gurte.thanks for all

2 వ్యాఖ్యలు:

Ramesh said...

ఎవరైనా ఈ క్రింది సీరియల్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా?

1. ఇది ఎక్కడైనా వుందా
2. విచిత్ర కాశీ మజిలీ కధలు

Ramesh said...

అలానే giant robdot అనే సీరియల్ కూడా

Post a Comment