Sunday, May 10, 2009

అమ్మ (మా ఇంటి చీమ, బుడం‘కాయ’)

అదేంటి ఎక్కడైనా అమ్మలను దేవతలతో పోలుస్తారు కానీ... ఇలా చీమలతో, పాములతో పోలుస్తారా?? దీనికో ప్లాష్ బ్యాక్ ఉంది. మా అమ్మ, నేను తెల్లగా ఉంటాము. మా నాన్న, తమ్ముడు నల్లగా ఉంటారు. అందుకే మా నాన్న తమాషాగా ఒరేయ్ నేను, తమ్ముడు నల్లచీమలం. నువ్వు, మీ అమ్మ ఎర్రచీమలు అని తమాషాగా అనేవారు. నాన్న చనిపోయేవరకు ఏమీ తెలీదు... కానీ తర్వాత పడ్డబాధలు అన్నీ ఇన్నీ కావు. అమ్మకు అంతగా చదువురాదు.. ఏమీ తెలీదు. మాకు తెలీని వయసు. మొత్తానికి ఎలాగోలా బాధల నుండి ఓ 10 సంవత్సరాలకు విముక్తి దొరికినా... అమ్మ మాత్రం శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయి.. మోకాళ్ళ నొప్పులు, హై బీపి వచ్చాయి. కానీ, ఇప్పటికి అన్నీ తలుచుకొని బాధపడుతుంది. బంధువులంతా దూరమయ్యారు. మనకు ఎవరూ లేరు అని దిగులుపడుతుంది. ఎవరు ఉంటారు మనకి దేవుడు ఉన్నాడు.. నేను, తమ్ముడు నిన్ను చూసుకుంటున్నాము ఇంక ఏం కావాలి అని ఓదార్చుతాము.

ఆ ఓదార్పులో ఇలా తనని ముద్దుగా చీమ, బుడంకాయ (కొంచెం పొట్టిగా ఉంటుంది) అని పిలుస్తాము.. చెప్పాలంటే తను అమ్మ కాదు... మా బిడ్డ అన్నట్టు ముద్దు ముద్దుగా పిలుస్తాము... అలా పిలిచేవాటిలో బుజ్జి, జుజ్జులు, కాయ (బుడంకాయను షార్ట్ కట్ చేసి.... అయినా కాయ అని కాకుండా పండు అనే పిలువాలని రూలుందా ఏంటి?) ఇలా ఇంకా ఏవేవో వస్తుంటాయి. అమ్మ అని పిలిచేది తక్కువ. తను కూడా ఇలా ఎలా పిలిచినా పలుకుతుంది.

చదువు రాకపోయినా... తనకు తెలిసిన విద్య మిషన్ కుట్టడం.... మోకాళ్ళ నొప్పులయినా మొన్నీ మధ్యదాకా బట్టలు కుట్టి ఆర్ధికంగా తనవంతు సహాయపడేది. నేనే ఈ మధ్య తిడితే మానేసింది. మోకాళ్ళ నొప్పులు రాకాపోతే ఇంక మా మాట వినేది కాదు. ఒక్కొసారి మా కాయ (అమ్మ) మమ్మల్ని చాలా విసిగిస్తుంది. ఊరికినే చిన్నవాటికి కోపం తెచ్చుకుంటుంది. పొద్దున్నే గోల మొదలుపెడుతుంది. అసలు మాకు ఆ టైమ్ లో ఎంత కోపం వస్తుందో తెలీదు. కానీ తనకున్నా శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితుల వల్ల అలా మారుతుంది. ఒక్కొసారి మేము పోట్లాడినా చాలా మటుకు తగ్గి కాసేపు మాట్లాడకుండా మౌనంగా ఉంటాము.

నాకు, మా కాయకు ఎక్కువగా గొడవలే జరుగుతాయి. ఎందుకంటే... మా తమ్ములుంగారికి అన్నీ టైమ్ కి చక్కగా అమర్చిపెడుతుంది. ఎంతైనా కొడుకు అందులో చిన్నోడు. నన్ను మాత్రం నా ముందు ఎప్పుడు తిట్టడమే. కానీ ఊరివాళ్ళ ముందు మాత్రం తెగ పొగుడుతుంది. ముఖ్యంగా నేను లేనపుడు మా తమ్ముడు దగ్గర..... నా పెద్ద బిడ్డే మీ నాన్న తర్వాత నాన్నలా కుటుంబ భాద్యత తీసుకుంది అని పొగుడుతుంది. ముఖ్యంగా మా వాడు ఏదైనా నిరాశ, నీరసంగా ఉంటే మాత్రం తప్పక క్లాస్ పీకుతుంది.

ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల తన బంగారం అమ్మేసాము. కానీ నా కోరిక మా కాయకు గాజులు, ఓ మాంచి గొలుసు చేయించాలి. కానీ తన కోరిక మంచాన పడకుండా ఎవరిచేత చాకిరీ చేయించుకోకుండా... నడుస్తూ, తిరుగుతూ పోవాలని. అచ్చు మా నాన్నలా.. ప్రస్తుతం బంగారం కొనకపోయినా... తనకు నచ్చిన చీరలు మాత్రం కొంటున్నాను. అపుడు మా కాయ మొహం మతాబులా వెలిగిపోతుంది. తనది చాలా చిన్నలోకం, చిన్న చిన్న కోరికలు. కానీ, తను ఊహించని విధంగా ఆశ్చర్యపరచి, సంతోషపరచాలి.

ఇలా పొగుడుకున్నా, పోట్లాడుకున్నా... మా కాయ నేను ఒక జట్టే. ప్రతిరోజూ మాకు మధర్స్ డేనే.. ఇలా బ్లాగులో నీ గురించి రాసా అని చెప్పినా కూడా ఆమెకు బ్లాగేంటో, ఇంటర్నెట్ ఏంటో ఏమీ అర్ధం కాదు. చెప్పాంటే చాలా ఉన్నా.... అవి మాటల్లో రాయలేనివి.... ఏదేమైనా మా కాయకు, జుజ్జులుకు బోలెడు.... ciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumciumcium pelukpelukpelukpelukpelukpelukpelukpeluk ఇంకా తనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను doadoadoa

6 వ్యాఖ్యలు:

మయూఖ said...

అమ్మ గురించి చాలా బాగా వ్రాసారు.

మధురవాణి said...

మీ అమ్మ గారి ముచ్చట్లు, ముద్దు పేర్లు బావున్నాయండీ.!

psm.lakshmi said...

మీ అమ్మగారు అదృష్టవంతులు మీలా ప్రేమగా చూసుకునే కొడుకులు వున్నారుకనుక.
psmlakshmi
psmlakshmi.blogspot.com

పరిమళం said...

ముందుగా మీకు అభినందనలు . అమ్మను ఎప్పటికీ అలాగే చూసుకోండి ...అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు .

మాలా కుమార్ said...

మీ కాయ ముచ్చట్లు ముద్దుగా వున్నాయి

మాతృదినొత్సవశుభాకాంక్షలు

కొత్త పాళీ said...

cute story.

Post a Comment