Friday, May 1, 2009

అమ్మా, నాన్నలా? మమ్మీ, డాడీలా?

రెండింటికి ఉన్న తేడా ఏంటి? ఎందుకు లేదు? తెలుగోళ్ళకు, తెల్లోళ్ళకు ఉన్నంత తేడా ఉంది. మీ కంప్యూటర్ కు తెలుగొచ్చా? అని బ్యానర్ పెట్టినట్టు మీ పిల్లలకు అమ్మ, నాన్నఅని పిలవడం వచ్చా? అని కూడా పెట్టాలేమో!! garupale

మన రాష్ర్టంలో ఉన్నంతవరకూ మన భాష గుర్తురాదు. విదేశాలు వెళ్ళగానే అక్కడ తెలుగు పండుగలు జరపడం.. (అంటే ఇక్కడ కన్నా ఎక్కువ సంప్రదాయాలు పాటించడం వంటివి) తెలుగు భాష నేర్చుకోవడం... నేర్పించడం వంటి ‘పిచ్చి’ అభిమానం ఎందుకు పుట్టుకొస్తుందో!! అదే ప్రజలు ఇక్కడకొస్తే అక్కడి వయ్యారాల ఇంగిలిపీసు వలకబోసేస్తారుgigil. ప్రజలంతా ఇపుడు యుద్దప్రాతిపదికన తెలుగు భాషను పరిరక్షించేస్తున్నారు... ముందు ఇలాంటి (మమ్మి, డాడీ, ఆంటి, అంకుల్) పిలుపుల్లో మన ఇంట్లో నుంచి మార్పు తేగలిగితే మిగిలినది దానంతట అదే సరిఅవుతుంది.

పక్కంటివాళ్ళను, ఎవరైనా కొత్తవాళ్ళను ఆంటి, అంకుల్ అని పిలవడం వరకూ బాగుంది, ఎందుకంటే వారిని ఏ వరస ప్రకారం పిలవాలో తెలియదు కాబట్టి. కానీ, మన బంధువుల్లో ఉన్నవాళ్ళు... వాళ్ళు ఏ వరసవుతారో తెలిసినా, వాళ్ళను కూడా ఆంటి, అంకుల్ అని పిలవడం.. ఎంతవరకూ బాగుంటుంది? మా బంధువుల్లో ఒకరు పెద్దనాన్న, పెద్దమ్మలను Big Daddy, Big Mom అని పిలుస్తారు... మరీ బడాయి ihikhik .

మాకు తెలిసిన ఓ పెద్దాయన మనుమరాలు అమెరికా నుంచి వచ్చింది... 4 ఏళ్ళు ఉంటాయి. చక్కటి తెలుగు మాట్లాడుతుంది... మా అందరి ముందు బడాయి కోసం.... ఆ అమ్మాయి తెలుగు మాట్లాడినపుడల్లా ఆ పెద్దాయన ఇంగ్లీషులో మాట్లాడు, ఇంగ్లీషులో మాట్లాడు అని అంటున్నాడు. ఇలాంటి పిల్లలు అమెరికాలో తెలుగు నేర్చుకోవడం ఓ పెద్ద గొప్ప, ప్రపంచ వింత... అదే తెలుగు ఇక్కడ మాట్లాడితే మాట్లాడనివ్వరు. marah

ఇక అంకుల్ గురించి మా సోషియాలజీ మాష్టారు చెప్పిన ఓ సంగతి గుర్తుకొస్తుంది...
ఓ 18 ఏళ్ళ అమ్మాయి పక్కింట్లో ఉండే ఓ 40 ఏళ్ళతన్ని అంకుల్ అని పిలిచిందంట!! అపుడు ఆ ఇంటి మీద పెంకులు గాడు పళ్ళు ఇకిలిస్తు... అంకుల్ కి చిన్నాన్న, మామయ్య అనే రెండర్ధాలు ఉన్నాయి.. నువ్వు ఏ అర్ధంతో పిలిచావో చెపితే నీతో నా ‘ప్రవర్తన’ ఆ విధంగా ఉంటుంది అన్నాడట. ఇక ఆంటీ అంటే కొన్ని సినిమాల్లో విన్న ద్వంద్వార్ధాల వల్ల ఆంటీ అనే మాటే పెద్ద బూతులా వినిపిస్తుంది + ఒకసారి బస్టాపులో నిలబడినపుడు కొందరి పోకిరీ వెధవల మాటలవల్ల కూడా అది నిర్ధారణ అయింది (ఇక్కడ రాయలేనిది). xpasti diam

నాకు తెలిసిన స్నేహితుల్లో కొందరు అమ్మ, నాన్న అనే పిలిపించుకుంటారు... ఏంటి అని అడిగితే... ఈజిప్టు మమ్మీలు, కరీమ్ బీడీలు మనకెందుకమ్మా!! అమ్మ, నాన్న అంటేనే బాగుంది అంటారు. మా ఇంట్లో కూడా అమ్మ, నాన్న అనే పిలుస్తాము... రేపు మా పిల్లలు కూడా అంతే!! senyumkenyit

మీరంతా అమ్మ, నాన్న అని పిలిచి దయచేసి మీ పిల్లల చేత మమ్మి, డాడీ అని పిలిపించుకోకండి. తెలుగు భాషకు ఓ పెద్ద గొప్ప సేవ చెయ్యలేకపోయినా... ఇలాంటివి మార్చగలం కదా!!! senyum.

14 comments:

సుజాత చెప్పారు...

మా అమ్మాయి మమ్మల్ని అమ్మ, నాన్న గారు అనే పిలుస్తుంది. అమెరికన్స్ ముందు అయినా సరే!(నాన్న"గారూ" ఏమిటి పెద్ద గొప్ప అనకండి, నాకు అలాగే అలవాటు మా నాన్నగారి విషయంలో! తనకీ అలాగే అలవాటు చేసాను)

హర్షోల్లాసం చెప్పారు...

మేము మా అమ్మా, నాన్న లని ,అమ్మా ,నాన్నా అనీ పిలుస్తాము.తదుపరి మా పిల్లల తో కూడా అలాగే పిలిపించుకుంటాము.కాని ఈ విషయంలో మాత్రం నావారకు ఏమనిపిస్తుందంటే మనమే వాళ్ళకి చిన్నప్పటినుంచి(మాటలు వచ్చేటప్పటినుంచి) చెప్పాలి.అప్పుడే వళ్ళు దాన్ని అభ్యసిస్తారు.నావరకు(personal gaa) మాత్రం నాన్న ని నాన్నా అనే పిలవాలని వుంటుంది "నాన్నగారు" అనటానికి నేను వ్యతిరేకిని.

మధుర వాణి చెప్పారు...

అమ్మా నాన్నలకే నా ఓటు కూడా..! కానీ.. అదేంటో చిత్రంగా నేను అమ్మా, డాడీ అని పిలుస్తాను. ఎందుకు అలా అలవాటయిందో మరి చిన్నప్పుడు నాకు తెలీదు.
కాకపోతే మధ్య మధ్యలో.. నాన్నా అని కూడా అంటుంటాను. కానీ.. అమ్మ, నాన్న అంటేనే చక్కగా ఉంటుంది. అది మాత్రం నిజం :)

చదువరి చెప్పారు...

"Big Daddy, Big Mom" :) :)

కొత్త పాళీ చెప్పారు...

మమ్మీ డాడీ అని పిలిస్తూ కూడా తెలుగు భాష అన్నా, సాహిత్యం అన్నా ఎనలేని ప్రేమ ఉన్న వ్యక్తులు చాలా మంది నాకు తెలుసు.
భాష వాడుక గురించిన బహిరంగ చర్చలో ఈ మమ్మీ డాడీ అనేది మాతృభాష అంటే ఏమాత్రం లక్ష్యం లేని ఒక ఆలోచనా విధానానికి, ఒక జీవన విధానానికి ప్రతీక అయి కూర్చుంది.
కేవలం పిలుపుల్లో మార్పు వచ్చినంత మాత్రాన భాష పట్ల ప్రజల ప్రవర్తన మారిపోదు. కాకపోతే మార్పు ఇంటిలోనించి మొదలవ్వాలనే ప్రతిపాదనతో మాత్రం నేను ఏకీభవిస్తాను.
అంకుల్ .. అంటీ .. అది వేరే ఘోష.

K చెప్పారు...

మీరు బ్లాగిందంతా ఒక ఎత్తు అయితే, కొందరు తల్లితండ్రులు పిల్లలతో పూర్తిగా ఇంగ్లీషులో మాట్లాడటం ఇంకొక ఎత్తు. అలాంటి తల్లితండ్రులని చూసినప్పుడు నాకు ఎలాంటి తిక్క రేగుతుందంటే....

bhavani చెప్పారు...

నేను మమ్మీ, డాడీ అనే పిలుస్తాను.
నాకు అలా పిలిస్తేనే కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అదొక అలవాటు. అంతే.
నా వరకైతే, దీనికీ, భాషకీ ఏ సంబంధమూ లేదు. పైగా శ్రీకాకుళం మాండలికాన్ని ఎక్కువగా వినటనికీ, మాట్లాడటానికీ ఇష్టపడతాను. నేను నా ఎం.ఎ లో వ్రాసిన మొదటి టెర్మ్ పేపర్ "శ్రీకాకుళం మాండలికం" పైన.
ఇంగ్లీషులో ఎన్నో అరువు తెచ్చుకున్న పదాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఇంగ్లీషులో ఇంగ్లీషు శాతం ఎంతో చెప్పటం కష్టమే.
(http://www.ruf.rice.edu/~kemmer/Words/loanwords.html). అయినప్పటికీ ఇంగ్లీషు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకెందుకు రాలేదంటారు? కేవలం అది అంతర్జాతీయ భాషగా ఎదగడం మూలంగానే కాదు. ఆ భాషలో నేను ఎప్పుడో ఉన్న cultural Terms మాత్రమే కాక, కొత్త కొత్త విషయాల(సైన్స్ అండ్ టెక్నాలజీ )గురించి కూడా మాట్లాడగలను. ఆ వెసులుబాటు నాకు మాతృభాషలో ఉంటే, నేను అందులోనే మాట్లాడుతాను.
తెలుగు అభివృద్ది చెందటం అంటే ఈ కొత్త విషయాలని మనం మాట్లాడుకునేలా చేయటం. లేకున్నా ఆ భాషని మాట్లాడే వాళ్ళు ఉన్నంత కాలం తెలుగు బ్రతుకుతుంది. కేవలం, అరువు
తెచ్చుకున్న పదాల వల్ల మన జీవితాల్లో తెలుగుకున్న
ప్రాముఖ్యానికి ఏమీ కాదు.

sri చెప్పారు...

using your emoticons seems very sweet to me !

nice post !

Sadhu.Sree Vaishnavi చెప్పారు...

అమ్మా, నాన్నలా ? మమ్మీ , డాడీలా? పొస్ట్ చాలా బాగుంది. నేను అయితే అమ్మ, నాన్న అని పిలిచేదాన్ని. స్కూల్లో ఇంగ్లీష్ లో మాట్లాడాలనె నియమం వుంది. మా స్కూల్లో. అమ్మ నాన్న అంటే కొడతారు కూడా. ఇంట్లో ఏమో అమ్మా అని పిలవమంటారు. అమ్మ అనే పిలుపులొ తియ్యదనం వుంది . కానీ తప్పదు కదా . నేను అయితే ఎందుకంత చికాకనీ ఇంట్లో అమ్మ బయట మమ్మీ. అంతే అందరూ సంతోషం .
మంచి పొస్ట్ చాలా బాగుంది. thank you bye.

|| వాణి || చెప్పారు...

నా పరిధిలో జరిగిన అంశాలను తీసుకొని నేను రాసిన టపా ఇది..
నాతో పాటు చదివే అమ్మాయి ఉంది... తెలుగు అంటే అదో చండాలం అన్నట్టు మాట్లాడుతుంది... చివరాఖరికి తేలిందేంటంటే... ఆమెకు అటు ఇంగ్లీషు సరిగ్గా రాదు.. తెలుగు సరిగ్గా రాదు.. అలా చులకనగా మాట్లాడుతుంటే మనస్సు చివుక్కుమంటుంది. పోనీ చెబుదామంటే... ఆమె గొప్పలు, గప్పాలు వినేసరికే మాకు సమయం సరిపోదు.. మొన్ననే 2వ సంవత్సరం డిగ్రీ రాసాము.. తెలుగులో నేను తప్పుతానేమో అని గొప్పగా చెప్పుకుంటుంది... :-(. పోనీ ఇంగ్లీషుమీడియం కదా అంటే గత సంవత్సరం అటు తెలుగు ఇటు ఇంగ్లీషు పాస్ మార్కులతో పాసయ్యింది.
నేను ఇపుడు తెలుగు మీడియం చదువుతున్నాను.. నా పుస్తకాలు, నా మీడియం చూసి మా ఆపీసులో వాళ్ళే చాలా వెటకారంగా, వెక్కిరింతగా మాట్లాడారు.. ఆ రోజు ఏడ్చాను కూడా... చెప్పుకుంటూ పోతే చాలా... వాళ్ళని ఏదైనా ఇంగ్లీష్ పదానికి అర్ధం చెప్పమంటే... తెలుగులో చెప్పడం రాదు అంటారు. నా భాషే నాకు సరిగ్గా రాకపోతే వేరే భాష ఏమీ నేర్చుకోగలను?
ఓహ్.. అంశం అమ్మా, నాన్నల నుంచి భాషకు మళ్ళింది....

సుజాత గారు
:-) చాల సంతోషం

హర్షోల్లాసం గారు
అవునండీ చిన్నప్పటినుండి అలవాటు చేయాలి. ‘నాన్నగారు’ పిలవటానికి నేను వ్యతిరేకం కాకపోయినా మా నాన్నే అలా పిలిపించుకోవటానికి ఇష్టపడేవారు కాదు.. శ్రీశ్రీ గారి రాసిన ఏదో పుస్తకంలో నాన్న అనేది దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది.. నాన్నగారు అంటే ఎవరో బయటవాళ్ళను పిలిచినట్టుగా ఉంటుంది.. ‘మన’ అనుకున్నపుడు ‘గారు’ అని పిలవవం కదా!! అని ఉందంట.. అందుకే నాన్న అనే పిలిచేవాళ్ళం.

మధురవాణి గారు
:-)

చదువరి గారు
పిన్నిని పాపం little mom లేదా small mom అని పిలవడం లేదు రక్షించారు.

కొత్తపాళీ గారు
భాషపై ప్రేమ ఉన్నవాళ్ళు , వాళ్ళు పిలవలేకపోయినా వాళ్ళ పిల్లల చేతయిన పిలిపించుకుంటే బాగుంటుంది అని నా ఉద్ధేశ్యం... పరభాష వాళ్ళు ఇక్కడకొస్తే వాళ్ళు అమ్మ, నాన్న అలవాటు చేసుకోరుగా... అలాగే మనవాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. సాహిత్యం పై ఉన్న ప్రేమ ఇలాంటి చిన్నవాటిల్లో కూడా చూపించొచ్చు కదా!! మీలాంటి గొప్పవాళ్ళకు చెప్పేంత భాష నా దగ్గర లేదు..

K గారు,
పక్కన నాలాంటి ఇంగ్లీషు రాని మొహాలు ఏడిస్తే... వాళ్ళకు ఇంక పండగ.. మాలాంటి వాళ్ళు ఉన్నపుడు ఇలాంటి వాళ్ళు ఇంక ఎక్కువ చేస్తారు... తిక్కరేగినా తిట్టుకోవడం తప్ప ఏం చేయగలం చెప్పండి? :-(

Bhavani గారు,
భాషలో వెసులుబాసును వెతుక్కోవడం అనేది మన ఆసక్తిని బట్టి ఉంటుంది. చిన్న చిన్న వాటినే మార్చేస్తున్నారు కదా!! ఇంక మాట్లాడేవారు ఎక్కడ ఉంటారు? మమ్మీ, డాడి అని పిలవటం అనేది ఇంక మీ వ్యక్తిగత విషయం. ఇలాగే పిలవాలి అని మీపై అధికారం చెలాయించలేనుగా!!

Sri గారు,
యాహు ఎమోషన్స్ అంటే నాకు చాలా ఇష్టం.. మొత్తానికి నెట్ లో వెతికి నా టపాల్లో పెట్టుకొనే విధంగా చేసుకున్నాను.

Sadhu.Sree Vaishnavi గారు
బయట ఇలాంటి కొన్ని కష్టాలు తప్పవు.. అయినా ఇంట్లో అమ్మ అని పిలుస్తున్నారు.. సంతోషం :-) ‘అమ్మ అనే పిలుపులొ తియ్యదనం వుంది’ అవును అందుకేగా ఈ టపా.

సుజాత చెప్పారు...

మా పెదనాన్న గారు తెలుగు లెక్చరర్ గా రిటైర్ అయ్యారు. నోరు విప్పితే పాండిత్యం, తెలుగు ఉద్ధరణ గురించి మాట్లాడతాడు! పిల్లలు మాత్రం మమ్మీ డాడీ అంటూ పిలుస్తుంటారు. భాష మీద అంత ప్రేమ ఉన్న వారు అమ్మ నాన్న అని పిల్లలకు ఎందుకు అలవాటు చెయ్యలేదంటే..."వాళ్లకలా ఇష్టం!, వాళ్ళ ముచ్చట నేనెందుకు కాదనాలి?" అంటాడు. ఇదీ పరిస్థితి!

HAREPHALA చెప్పారు...

మీరు వ్రాసినదంతా చాలా బాగుంది.అదే ఉద్దేశ్యం తో ఈ మధ్యన ఒక ప్రముఖ తెలుగు రచయిత గారికి ఒక మెయిల్ తెలుగు లో పంపాను.ఆయన నుండి తెలుగు లో జవాబు ఆశించాను. కానీ ఆయన ఆంగ్లం లో జవాబు ఇచ్చారు.నేను చాలా నిరాశ చెందాను.బయట చెప్పే ఖబుర్లు ఆచరణ లో పెట్టి ఉంటే చాలా బాగుండేది .నేను ఆంగ్లం లో రా య లేక కాదు ,ఈ మధ్యన వచ్చిన భాషాభిమానంతో తెలుగు లేఖిని ద్వారా తెలుగు లో వ్రాయడం నేర్చుకొన్నాను.మూడు నెలలో టైప్ చేయడం నేర్చుకొని ఈ కార్యక్రమాలలో పాల్గొనే ఆనందం అనుభవిస్తున్నాను.నేను న్లభై అయిదు సంవత్సరాలు రక్షా ఉత్పాదన శాఖ లో పనిచేసి నాలుగు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను.

|| వాణి || చెప్పారు...

ఇంత పెద్దవారు, అంత ఉన్నత పదవి నిర్వహించినవారు, జీవితంలో అనుభవజ్ఞలైన మీకు నేను రాసింది నచ్చడం ముందుగా నా అదృష్టం.
ఇక కొందరి సాహిత్యసేవ, భాషాభిమానం ఇవన్నీ బయటవారి మెప్పుకోసమేనేమో!!! అలాంటివారిని వేలెత్తి చూపే అర్హత కూడా లేనిదాన్ని ఎందుకంటే నాకేమీ గొప్ప తెలుగు రాదు. కానీ, ఇలాంటి చిన్న చిన్న విషయాలను గమనిస్తూ ఆ విధంగా భాషాభిమానం మనం ప్రకటించవచ్చు. కాకపోతే ఇలాంటివాటికి బయట మెచ్చుకొని మేకతోలు కప్పేవాళ్ళు ఉండరు. నేను సాహిత్యసేవ చేస్తున్నాను అంటే సన్మానాలు చేస్తారు కానీ... మా తల్లితండ్రులను అమ్మ, నాన్న అని పిలుస్తున్నాను లేదా మా పిల్లల చేత అమ్మ, నాన్న అని పిలిపించుకుంటున్నాము అంటే ఎవరైనా సన్మానాలు చేస్తారా? గుర్తిస్తారా?

sanjay చెప్పారు...

meru chala manchi vishayam chepparu
amma ani pilusthe chala baguntundi, manam gayam inappudu amma ani pilusthamu kani mumy ani notiventa radhu ,

amma ane padamloni kamadanam denilo ledhu

0 వ్యాఖ్యలు:

Post a Comment