Monday, June 8, 2009

ఈ వర్షం సాక్షిగా....

బాగా చలిగా అనిపిస్తుంది. ఎండకాలంలో ఇంత చల్లగా ఉందేంటని? ఆ నిద్రమత్తులోనే దుప్పటిని కాళ్ళ నుండి ముఖం మొత్తం కప్పేసుకున్నాను. అసలే ఆదివారం ఏ పని చురుకుగా చెయ్యబుద్దేయ్యదు. బద్ధకంగా అనిపిస్తుంది. ఏంటో మరి!!!! అలాగే నిద్ర కూడా ఆలస్యంగా లేచి బద్ధకంగా ఆవులిస్తూ కిటికి వైపు చూసాను. నా చలికి కారణమేంటో అపుడు తెలిసింది. బయట వర్షం పడుతుంది.

ఈ ఎండల్లో మండి మండి ఆ చల్లదనం... వర్షాన్ని చూసేసరికి ఆహా!!! ఓహో!!!! బయటకెళ్ళి డాన్స్ చెయ్యాలనిపించింది. కానీ, చూట్టూ ఉన్న జనాలు చూస్తే బాగోదని ఊరుకున్నా.... బయట నేలపై పచ్చిక, చెట్లు... అన్నీ నాలాంటి సంతోషాన్నే అనుభవిస్తున్నట్టు అనిపించింది. వాటిని చూసి కాసేపు అసూయ పడ్డాను... ఎందుకంటే అవి హాయిగా వర్షంలో తడుస్తున్నాయి.. నీకా ఛాన్స్ లేదులే వ్వె వ్వె వ్వె అని అవి వెక్కిరిస్తున్నట్టు అనిపించి బాధపడ్డాను. కాసేపు అలాగే కిటికి చువ్వలు పట్టుకొని..... వర్షాన్నే చూస్తూ కూర్చున్నా...

ఇంక సరే తప్పదన్నట్టు లేచి బ్రష్ చేసి కాస్త టీ డాకాక్షన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం చేర్చి... అది పట్టుకొని మళ్ళీ కిటికి దగ్గర కొచ్చి వర్షాన్ని, చెట్లను చూస్తూ కూర్చున్నా.... టీ అయిపోయింది.... ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే .... చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తోచ్చాయి... అంతే న్యూస్ పేపర్లు పోగేసి....కాగితంతో పడవలు చేసా... మొదట ఎలా చెయ్యాలో గుర్తురాలేదు... మర్చిపోయా... కాసేపు కుస్తీ పడితే గుర్తుకొచ్చింది. స్లాబు పై నుంచి కారుతున్న నీటివల్ల ఇంటి గుమ్మం ముందు చిన్న కాలువలా తయారయింది. పడవలన్నీ వదిలాను... ఇంట్లో నుండి ఓ మూడు గిన్నెలు తెచ్చా... స్లాబు పై నుండి పడుతున్న ధార కింద పెట్టా... ఖాళీగా ఉన్న గిన్నెలో వర్షం పడుతున్నపుడు ఓ రకమైన సౌండ్, సగం నిండాకా ఓ రకమైన సౌండ్, పూర్తిగా నిండాకా ఇంకో రకమైన సౌండ్...

మరీ ఇలా ఉంటే బాగోదని.... స్నానం కాస్త ముగించి... ఇంక టిఫిన్ ఏమీ వద్దు... భోజనం వేళవుతుందని... వంట పని మొదలెట్టా.... అన్నం వండాను... ఇంట్లో కూరలేమీ లేవు... కొత్తావకాయ పచ్చడితో కానేచ్చేద్దాం అని అనుకున్నా. నాకు ఎప్పటినుండో ఒక కోరిక... బయట బాగా వర్షం దంచికొడుతుంటే.... ఏదైనా కారం కారంగా తింటూ... మంచి కామెడీ సినిమా చూడాలని.... వర్షం, కారం కారం, కామెడీ ఈ మూడింటిలో ఎపుడూ ఏదో ఒకటి మిస్ అవుతాను... ఏంటో నా అదృష్టం... ఏమీ తోచటం లేదని టి.వి. ఆన్ చేస్తే ఏదో ఛానల్లో అప్పుల అప్పారావు సినిమా వేస్తున్నాడు.. బయట వర్షం... ఇక గబగబా ఆవకాయన్నం కలిపి టి.వి. ముందు కూర్చున్నా....

రాత్రి నిద్రపోయే ముందు ఏదో గొప్ప సంతృప్తిగా అనిపించింది. హుమ్ మొత్తానికి ఈ రోజు వర్షంతో టైమ్ పాస్ బాగుంది. బాగా ఎంజాయ్ చేసా... ఇక రేపు సోమవారం ఉరుకులు, పరుగులు... తెల్లారి 5.30కు అలారం సెట్ చేసి నిద్రపోయా... రాత్రి నిద్రపోయేటప్పటికి వర్షం తగ్గినట్టు ఉంది. కానీ ఏ అర్ధరాత్రో మళ్ళీ మొదలయిందనుకుంటా...

పొద్దున్న అలారం గణగణలకు నిద్ర లేచేసరికి వర్షం బాగానే పడుతుంది... గబగబా పనులన్నీ చూసుకొని ఆఫీసుకు బయలుదేరాను. వర్షం తగ్గలేదు. దిక్కుమాలిన వర్షం ఛీ... హాండ్ బ్యాగ్, లంచ్ బాక్స్, ఈ రోజు గొడుగు ఎగట్రా మోత... రోడ్డు మీదకెళ్ళి చూద్దును కదా!!! నిన్నటి వర్షానికి, ఈ రోజు వర్షానికి కలిపి ఓ మాదిరి బురద... డ్రైనేజ్ పొంగిందేమో!! మొత్తానికి నా డ్రెస్ కు అంటకుండా బస్టాపుకెళ్ళి బస్సులో చూస్తే అందరి చేతుల్లో గొడుగులు... బస్ బాగా రష్ గా ఉంది.. దేవుడా...

ఎలాగొలా ఆఫీసులో పడ్డా... కానీ కాళ్ళంతా బురద... డ్రెస్ అటూ ఇటూ కొంచెం తడిచింది. సాయంత్రం వరకూ ఈ మాయదారి వర్షం ఇలాగే పడితే మోకాళ్ళ లోతు నీళ్ళలో ఈదుకుంటూ పోవాలి. ఛా!!! నా మీద నాకే చికాకు. ఆఫీసులో నా సీటులో కూర్చొని.... ఆలోచించా... నిన్న వర్షంతో ఎంజాయ్... ఈ రోజు ఇలా తిడుతున్నానేంటి?? అని.... ఈ లోపు మా ప్యూన్ వచ్చి అమృత మేడమ్ సార్ రమ్మంటున్నారు అని పిలిచాడు... ఇక వర్క్, ఫైల్స్, గోల...

5 వ్యాఖ్యలు:

హరే కృష్ణ said...

ఆదివారం రాత్రి బాధపడడం చాలా న్యాచురల్ ..మీరు బహుసా ఆంధ్రా లో వున్నారు అనుకుంటా ..బావుంది టపా .

శేఖర్ పెద్దగోపు said...

మీ టపా మొత్తంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు ఎటువంటి హెసిటేషన్ లేకుండా ఆలోచన వచ్చిందే తడవుగా మీ పెద్దరికాన్ని కాసేపు పక్కన పెట్టి పడవలు చేయటం...గిన్నెలు పెట్టడం. అతికొద్ది మంది మాత్రమే ఇలా అనుకున్న వెంటనే చిన్న పిల్లలు అయిపోగలరని నా అభిప్రాయం. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కలసినప్పుడే లైఫ్ లైవ్లీ గా ఉంటుంది.

రాధిక said...

good one.agree with shekhar garu.

నీ నేస్తం said...

thanks to all of u :)

నేస్తం said...

మీ శైలి చాలా బాగుంది ..చాలా బాగా రాసారు

Post a Comment